కృష్ణాజిల్లా ముసునూరు మండలం యల్లాపురం గ్రామంలోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం నీడలో పేద విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఆ పాఠశాల పేరెంట్స్ కమిటీ ప్రసిడెంట్ పెనమలుారి రజినిబాబు తెలిపిన వివరాల ప్రకారం. యల్లాపురం ప్రభుత్వ పాఠశాలల్లో 20 మంది విద్యార్థులు ఉండగా ఇద్దరు టీచర్లు పనిచేస్తున్నట్లు చెప్పారు. ఒక టీచర్ ఈ పాఠశాల నుండి బదిలీ అవ్వడంతో, ప్రస్తుతం లక్ష్మీ పార్వతి అనే టీచర్ పనిచేస్తున్నారన్నారు. ఈ టీచర్ గత కొంత కాలంగా ఉదయం 11 గంటలకు పాఠశాలకు వచ్చి మధ్యాహ్నం 1 గంటకు విద్యార్థులకు భోజనం పెట్టించి వెళ్లిపోతుందని అన్నారు. విద్యార్థులు రోజుా మధ్యాహ్నం నుండి పంట పొలాల్లో, రోడ్లపై తీరుగుతుంటే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్య పై ముసునూరు ఎంఈవో టి. శాంతి భూషణంకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్ 1100 కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. ప్రభుత్వానికి ఎంఈవో తప్పుడు నివేదికలు ఇచ్చి, టీచర్ లక్ష్మీ పార్వతికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి యల్లాపురం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.